ప్రతిక్షణం మలుపులతో శ్రీవల్లి కొత్త అనుభూతినిస్తుంది

ప్రతిక్షణం మలుపులతో శ్రీవల్లి కొత్త అనుభూతినిస్తుంది

కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం. క్రియేటివిటితో కూడిన నవ్యమైన కథలతో చిత్రాలు తీస్తామని చెబుతున్నారు రాజ్ కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్.  రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ దంపతులు నిర్మించిన చిత్రం శ్రీవల్లి. బాహుబలి ఫేం ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రజత్, నేహా జంటగా నటించారు.  ఏరోటిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందకురానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు రాజ్‌కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ పాత్రికేయులతో తమ మనోభావాల్ని పంచుకున్నారు. ఆ విశేషాలివి..
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా..
మా స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులున్నారు. వారి స్ఫూర్తితో అనుకోకుండానే చిత్రసీమపై మమకారం ఏర్పడింది. వినూత్నమై కథా చిత్రం ద్వారా నిర్మాతలుగా సినీరంగంలోకి అడుగుపెట్టాలని సంకల్పించాం. బాహుబలి సిరీస్ చిత్రాలకు మాటల రచయితగా పనిచేసిన విజయ్‌కుమార్‌తో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ద్వారా విజయేంద్రప్రసాద్‌గారితో పరిచయమేర్పడింది. మేము సినిమా తీసే ప్రయత్నాల్లో వున్నామని, ఓ వినూత్నమైన కథ కావాలని ఆయన్ని కోరాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ బాగా నచ్చింది. ఈ కాన్సెప్ట్‌కు విజయేంద్రప్రసాద్‌గారు మాత్రమే న్యాయం చేయగలరని భావించి ఆయనకే దర్శకత్వ బాధ్యతల్ని అప్పగించాం.
తెలుగు తెరపై రాని కాన్సెప్ట్ 
శ్రీవల్లి అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమెపై ఓ శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వల్ల శ్రీవల్లికి గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇంతకి ఆమెను అంతగా వేంటాడిన గత జన్మ రహస్యాలేమిటి? మనసును కొలవగలిగే వినూత్న ప్రయోగానికి శ్రీవల్లి ఎందుకు ఒప్పుకుంది? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ చిత్ర కథ నడుస్తుంది. తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది.
తెలుగులో వినూత్న ప్రయోగం 
ఈ సినిమా ఆరంభం నుంచి రాజమౌళి టీమ్ మాకెంతో సహాయసహకారాల్ని అందించింది. ప్రతి విషయంలో మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించింది.  చాలా కొత్త కథ ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని సుకుమార్ అభినందించారు. ఒక అమ్మాయిని  సైంటిస్ట్‌గా చూపించడం కొత్తగా వుందని, తెలుగులో వినూత్న ప్రయోగాత్మక చిత్రమిదని నిజామాబాద్ ఎంపీ కవితగారు మా సినిమాను మెచ్చుకున్నారు. ఆమె మాటలు మా చిత్ర బృందానికి కొత్త ఉత్సాహానిచ్చాయి. ప్రీరిలీజ్ వేడుకకు రామ్‌చరణ్ అతిథిగా హాజరవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలా చిత్ర పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు మా చిత్రానికి స్వచ్ఛందంగా తమ ఆశీస్సులు అందించారు.
అన్ని ఏరియాల బిజినెస్ పూర్తయింది..
వాస్తవానికి ఈ సినిమాను కొద్ది నెలల క్రితమే విడుదల చేయాల్సివుంది. గ్రాఫిక్స్ పనుల కోసం అదనపు సమయాన్ని వెచ్చించడంతో విడుదల ఆలస్యమైంది. సినిమాకు అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తయింది. దాదాపు 200లకు పైగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు కలిగిన విజయేంద్రప్రసాద్ వంటి రచయిత ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడంతో  సినిమా కోసం యావత్ ప్రేక్షకలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.
సుకుమార్ రైటింగ్స్‌లో తదుపరి చిత్రం..
కథలోని కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే నిర్మాతలుగా మా లక్ష్యం. సుకుమార్ స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌లో తదుపరి సినిమాను చేయబోతున్నాం. రాజ్‌తరుణ్ హీరోగా నటించే ఈ చిత్రానికి సూర్యప్రతాప్ (కుమారి 21ఎఫ్ ఫేమ్) దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాలన్నదే నిర్మాతలుగా మా అభిలాష. ఆ శుభతరుణం కోసం ఎదురుచూస్తున్నాము.




Previous
Next Post »