అప్పుడు కుమారి 21 ఎఫ్... ఇప్పుడు దర్శకుడు...త్వరలో మళ్లీ కుమారి 21ఎఫ్ కాంబినేషన్ రిపీట్!

చిన్న చిత్రాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం కుమారి 21 ఎఫ్. జీనియస్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం అప్పట్లో హాట్‌టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నుంచి రానున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు ఆగస్టు 4న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తరుణంలో సుకుమార్ రైటింగ్స్ సంస్థ తన మరో తాజా చిత్రానికి శ్రీకారం చుట్టబోతుంది. కుమారి 21ఎఫ్  సెన్సేషనల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ తాజా చిత్రానికి సంగీతం అందించడం ఈ చిత్రంకు మొదటి ఆకర్షణ. కుమారి 21ఎఫ్ విజయంతో తారాజువ్వలా దూసుకెళ్తున్న రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. కుమారి 21ఎఫ్  చిత్రంతో  తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న పల్నాటి సూర్యప్రతాప్ ఈ నూతన చిత్రానికి దర్శకుడు. వైవిధ్యమైన కథలకు చిరునామాగా చెప్పుకునే ప్రముఖ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న కథతో  సుకుమార్ రైటింగ్స్ అండ్ రేష్మాస్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌తో కలిసి విజయ ప్రసాద్ బండ్రెడ్డి, సునీత-రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తారు. సహ నిర్మాత శ్రీ తులసి బండ్రెడ్డి.  
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వైవిధ్యమైన చిత్రాలను అందించాలనే తపనతోనే సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించాం. సుకుమార్ ఆలోచనలు.. ఆయన విభిన్నత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుండి అందరూ ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలను కోరుకుంటారో ఈ తాజా చిత్రం కూడా అంతకుమించిన కొత్తదనంతో వుండబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం అని తెలిపారు.


Oldest